మహారాష్ట్రలో తెరచుకున్న ‘బాబ్లీ’ గేట్లు... శ్రీరాంసాగర్ కు చేరనున్న గోదావరి నీరు
తెలంగాణ, మహారాష్ట్ర మధ్య గోదావరి నదిపై ఉన్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరచుకున్నాయి. 14 గేట్లను ఎత్తివేయడంతో 90 వేల క్యూసెక్కుల నీరు శ్రీరాంసాగర్ లోకి వచ్చి చేరనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఏడాది జులై 1 నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు ‘బాబ్లీ’ గేట్లు తెరచి ఉంచాలి. అందులో భాగంగానే ఈ గేట్లను తెరిచారు. తెలంగాణ, మహారాష్ట్ర లకు చెందిన ఇరిగేషన్ శాఖాధికారులతో పాటు సీడబ్ల్యుసీ సమక్షంలో ఈ గేట్లను ఎత్తారు. బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి 80 కిలో మీటర్ల దూరంలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు మరికొన్ని గంటల్లో గోదావరి నీరు చేరనుంది. ఈ సందర్భంగా బాబ్లీ ప్రాజెక్టు అధికారులు మాట్లాడుతూ, ‘బాబ్లీ’ గేట్లలో 0.32 టీఎంసీల నీరు ఉందని చెప్పారు. అక్టోబర్ 29వ తేదీన గేట్లు మూసివేస్తామని చెప్పారు.